యావత్ దేశం ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరోవైపు ఇదే సమయంలో ప్రకృతి కూడా తన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలతో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తుండగా.. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడుతూ జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే.. గతకొద్ది రోజులుగా అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా వస్తున్న ఈ భూకంపాలతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తాజాగా.. లదాఖ్ ప్రాంతంలోని కార్గిల్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం నాడు తెల్లవారుజామున 5.47 నిమిషాలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. నార్త్ నార్త్-వెస్ట్ కార్గిల్‌కు 435 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.