దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరోవైపు సాధువుల హత్యలతో పాటు.. వారిపై దాడులు చేయడం కలకలం రేపుతోంది. గత ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని పాల్‌ఘర్ ప్రాంతంలో ఇద్దరు సాధువులపై మూకదాడి చేసి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గురువు పరమపదించడంతో అంతిమ సంస్కారాలకు వెళ్తుండగా.. పాల్‌ఘర్ ప్రాంతంలోని ఓ గ్రామస్థులు మూకదాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటు.. డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత.. యూపీలో కూడా ఓ పూజారి హత్య కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలు జరిగిన కొద్ది రోజులకే.. మళ్లీ పాల్‌ఘర్‌లో ఇద్దరు పూజారులపై దాడికి పాల్పడ్డారు దుండగులు. పాల్‌ఘర్ జిల్లాలోని బలివాలి సమీపంలో ఉన్న జగృత్ మహాదేవ్ మందిర్‌లో గురువారం తెల్లవారుజామున ముగ్గరు దుండగులు ఆయుధాలతో ప్రవేశించి.. అక్కడ ఉన్న పూజారులపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఆలయంలో ఉన్న సోమ్మును దోచుకెళ్లారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేశామన్న పోలీస్ అధికారులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టామన్నారు.