ఏపీలోని హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత 15 నెలల కాలంలో రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనల్లో జరిగిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని.. ఈ వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆలయాలపై సంఘనలు జరుగుతున్నప్పుడల్లా.. సీసీ కెమరాలు పనిచేయకపోవడమనేదానిపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఆలయాలపై జరుగుతున్న ఈ వరుస దాడులు మతిస్థిమితం లేని వాళ్లు చేస్తున్నారని చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఇలా హిందూ ఆలయాలపై మాత్రమే దాడులు జరగడం.. వాటిపై ఇలా మతిస్థిమితం లేని వారే దాడులు చేయడం వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నారు. ఈ వరుస సంఘటనలను గమనిస్తుంటే దేవాదాయ శాఖ నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కన్పిస్తోందని.. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో పాటు.. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. ప్రభుత్వ ఉదాసీన వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు.