టిక్‌టాక్.. సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యావత్ ప్రపంచంలోని యువతను ఈ టిక్‌టాక్ యాప్ ఆకర్షించింది. ఇక మన దేశంలోని యువత టిక్‌టాక్‌కు ఎంతోమంది అడిక్ట్ అయిపోయారు. నిత్యం వీడియోలు పెట్టి షేర్స్ చేస్తూ.. ఎంతో మంది టిక్‌టాక్ స్టార్స్‌గా ఎదిగిపోయారు. అయితే ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఈ యాప్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ.. వినియోగదారుడి వివరాల గోప్యత విషయంలో టిక్‌టాక్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందన్న కారణంతో దీనిపై బ్యాన్ విధించారు.
దీంతో టిక్‌టాక్ అభిమానులు ఇతర యాప్స్‌కు డైవర్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో యూ ట్యూబ్ టిక్ టాక్ అభిమానులను ఆకర్షించేందుకు యూ ట్యూబ్ షార్ట్స్ ను ముందుకు తీసుకు వచ్చింది. ఈ యూట్యూబ్ షార్ట్స్ ఇప్పుడు భారత్‌లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూ ట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఓ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం ఈ యూ ట్యూబ్ షార్ట్స్ మొబైల్ యాప్‌గా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఈ యాప్‌లో 15 సెకన్ల నిడివి గల షార్ట్ ఫిల్మ్, వీడియోలను షూట్ చేసుకునేందుకు వీలుంది. త్వరలో ఈ యాప్‌లో మరిన్ని ఫీచర్స్‌తో అప్డేట్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్‌లో దాదాపు లక్షకు పైగా మ్యూజిక్ పికర్స్ ఉన్నాయని.. త్వరలో మరిన్ని అందుబాటులోకి వస్తాయన్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వర్షన్‌లో అందుబాటులో ఉందని.. త్వరలోనే ఐఓఎస్ వర్షన్‌లో కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.