యూపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు దేనికి సంకేతం..!!..ఆ ఆలయం వైపు అడుగులు పడుతున్నాయా..?

Spread the love

యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అంతేకాదు.. ప్రతిపక్షాలు అన్ని కలిసి పోటీ చేసేందుకు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. పైకి మాత్రం ఒంటరి పోరు చేస్తున్నట్లు వ్యవహరిస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో బీజేపీ మాత్రం తాము చేసిన అభివృద్ధిని నమ్ముకుని ప్రజల వద్దకు ఓట్లను అడిగేందుకు వెళ్తోంది. అంతేకాదు.. మెజార్టీ ప్రజల మనోభావాలను గుర్తించి.. యూపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, కాశీ ఆలయ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్యా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

బీజేపీ రాష్ట్రంలో అభివృద్ధి పనులను వేగంగా చేస్తోందని వ్యాఖ్యానిస్తూనే.. హిందువుల మత విశ్వాసాలను గౌరవిస్తూ ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న వాటిని పరిష్కరించేందుకు చట్టపరంగా వెళ్తున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో సమస్య తొలిగిపోయిందని.. ఇక ఇప్పుడు మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమిలో కూడా ఆలయ నిర్మాణ కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ సీఎం కేపీ మౌర్య ట్వీట్‌ చేశారు. అయితే బీజేపీకి ఇవి ఎన్నికల సమస్యలు కావని అన్నారు. అయితే మౌర్య చేసిన ఈ ట్వీట్‌ యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థలం భూమి అంశంలో పలువురు కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇంతలో కొందరు అక్కడ పూజలు చేపడుతామంటూ కొన్ని హిందూ సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. అయితే మరోసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మథురలో శ్రీకృష్ణ జన్మస్థలం అంశంపై చట్టపరంగా న్యాయస్థానం ద్వారా వచ్చే తీర్పుకు లోబడి ఆలయ నిర్మాణం పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 


Spread the love
error: Content is protected !!