రుధిరం.. ఈ పదం ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ ఉపయోగించడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఓ స్పెషల్ కవరేజ్ స్టోరీ ప్లే చేసే సమయంలో.. స్టోరీ మధ్యలో యాంకర్ రుధిరం అనే పదప్రయోగం చేశారు. అయితే ఈ పదానికి అర్థం ఏమిటో తెలియక చాలామంది తంటాలు పడుతున్నారు. తెలుగు పదమా.. లేక సంస్కృత పదమా అన్నది తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. కొందరు సీనియర్ జర్నలిస్టులు మాత్రం వారి వారి సోషల్ మీడియా అకౌంట్ వేదికగా “రుధిరం” పదానికి అర్థం తెలియ చేశారు. రుధిరం అంటే రక్తం అని తెలియచేస్తూ.. ఆ పదం వాడాల్సిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే ప్రస్తుతం పడుతున్న వర్షాలను వర్ణించడానికి జడివాన అని లేదా కుంభవృష్టి అని పదాలను ఉపయోగించ వచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇక ఈ “రుధిరం” అనేది సంస్కృత పదమని.. తెలుగు అర్థం నెత్తురని ఓ మహిళా జర్నలిస్ట్ తన సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేశారు.