ఇప్పటి వరకు గోరక్షణ అంటే కేవలం యువకులు, పురుషులు మాత్రమే చేసిన వార్తలను చదివాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి యువతులు కూడా గోరక్షణ కోసం నడుంబిగించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలోని దుర్గావాహిని విభాగంకు చెందిన కార్యకర్తలు భద్రాచలం పట్టణంలో బుధవారం నాడు ఆవులు, దూడలతో వెళ్తున్న ఓ వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరితో పాటుగా స్థానిక విశ్వహిందూ పరిషత్ అధికారులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఉన్నారు. బుధవారం నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో భద్రాచలం పట్టణ సమీపంలోని బ్రిడ్జ్ వద్ద ఓ వాహనం ఆవులు, దూడలతో వెళ్తుండటాన్ని గమనించిన కార్యకర్తలు వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారుల సహాయంతో నిలిపివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. విశ్వ హిందూ పరిషత్ ఫిర్యాదు మేరకు వాటిని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం గోమాతలను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ ఓరుగంటి సురేష్, జిల్లా సహకార్యదర్శి వెంకటరాజు, బజరంగ్ దళ్ కార్యకర్తలు, దుర్గా వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.