దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న లవ్ జిహాద్ అంశం కేరళలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కేరళలోని హిందూ, క్రైస్తవ యువతులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడిలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రేమ ముసుగులో యువతులను ట్రాప్ చేసి.. అనంతరం మతం మార్చుతున్నారని అటు క్రైస్తవ సంఘాలు, హిందూ సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేరళ ఎమ్మెల్యే పీసీ జార్జ్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
దేశంలో లవ్ జిహాద్ జరుగుతుంది నిజమేనని పీసీ జార్జ్ అన్నారు. అంతేకాదు.. భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. క్రైస్తవ దేశాల్లోకి ముస్లింలు చోరబడుతూ వాటిని ముస్లిం దేశాలుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. ఆదివాసీ సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ఎన్జీవో హెచ్‌ఆర్‌డీఎస్ ఇండియా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2030 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని ముస్లింలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. నోట్లరద్దు జరగడం ద్వారా.. ముస్లింలు వారు చేద్దామనుకున్న పనులు కాస్త ఆలస్యమయ్యాయని అన్నారు. ఫ్రాన్స్ వంటి క్రైస్తవ దేశాల్లోకి ముస్లింలు చొరబడ్డారని.. ఇప్పుడు దాన్ని ముస్లిందేశంగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. లవ్ జిహాద్ లేదంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని.. కానీ లవ్‌జిహాద్ ఉందని తనకు తెలుసన్నారు. దీనికి చరమగీతం పాడలంటే భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాల్సిందేనని ఎమ్మెల్యే పీసీ జార్జ్ అన్నారు.